నెల రోజుల క్రితం భారతీయ విమానాశ్రయంలోంచి బయటకి వస్తూ తన్మయంగా ఆస్వాదించిన మట్టి వాసన -
నడిరేయి స్వాగతం నడిరోడ్డు మీద ఇచ్చిన గోవులూ, నిద్రని త్యాగం చేసి మరీ మొరిగి మేల్కొలిపిన కుక్కలూ,
కోరస్ గా పోర్టర్ల వ్యధలూ, బోనస్ గా కార్ల రొదలూ , దారంతా డ్రైవర్ కథలూ , కొత్త రక్తం కోసం స్వదేశి దోమల సోదలూ
రోడ్లకి అడ్డంగా నుంచుని పగలు వీలు కాని అర్ధరాత్రి ఆనందాన్ని అనుభవిస్తున్న పోసుకోలు ఊసుగాళ్ళూ
అన్నీ అందంగా కనిపించాయి , శ్రావ్యంగా వినిపించాయి, సమంజసమే అనిపించాయి.
కేరింతల నాట్యాలతో ఆకుల కొమ్మలూ, పలకరింతల స్పర్శలతో ఋతు పవనాలూ,
మాతృభాష మధురిమలతో పక్షుల రావాలూ, పరిగెత్తుకు వచ్చిచ్చిన పరిష్వంగంతో చిరు గాలులూ,
సుషుప్తి నుంచి సగం మేల్కొని ఓరకంటి మత్తు నవ్వుతో పరామర్శించి మళ్ళీ నిద్రలోకి జోగిపోయిన సన్నజాజి తీగలూ ,
రాక కోసం ఎదురుతెన్నులు చూస్తున్న ముంగిలీ, చిరునవ్వులతో బాహువులు చాచి రమ్మన్న ద్వారాలూ
ఇంతటి నిరీక్షణ, ఆదరణ మాకోసమే అని గుర్తుచేశాయి, సంతోషంతో ఉక్కిరి బిక్కిరి చేశాయి.
వర్ణం మారుతున్న ప్రాగ్దిశ సాయంత్రం దాక సాయం ఉంటానని వాగ్దానం చేసి గూడెక్కి, వేడెక్కి 'అప్పుడేనా ముందుంది పండగ' అని మాడు చల్లార్చింది -
పక్కింట్లోని నడిజాము సందడి విని తెల్లారేదాకా ఉగ్గబట్టుకున్న సందులోని పిల్లలంతా బిలబిల మని వొచ్చేసి హక్కుతో చాక్లెట్లు పట్టుకుపోయారు-
అక్కరకురాని soft skills నీ, తొక్కలో etiquette నీ వొదిలేసి, అమ్మలక్కలు కళ్ళల్లో ప్రశ్నలతో సూటిగా ఆపాదమస్తకం పరీక్షించేస్తూ చుట్టుముట్టారు -
నాలుగు రోజుల్లో చర్మం హంగునీ , pedicured పాదాల రంగునీ మార్చబోయే దుమ్ము రోడ్డుని తృప్తిగా చూసుకుంటూ వెళ్ళిపోయారు-
అమెరికా ఖండమంటే శుక్ర గ్రహానికి అవతల, దిక్కు తెలియని కుర్రకారంతా పొలోమని పోయే నిరుపయోగ ప్రదేశం అని నిశ్చయిన్చేసి,
అక్కడ మనుషులు సరిగ్గా బట్టలేసుకోరు, మనవాళ్ళు సరిగ్గా మాట్లాడుకోరు విడ్డూరం పోగాలము - కాబట్టి మనదేశమే మెరుగని తీర్మానించేసి,
అంత డబ్బులు తగలేసి మళ్ళీ ఇక్కడికే వొస్తారు అన్నిటికీ, పరుగుల పాలు తప్ప నిలబడి నీళ్ళూ తాగరని ఈసడిన్చేసి,
ఆరా తెలియక నిద్రరాదని, అర కిలోమీటర్ కుంటుకుంటూ నడిచొచ్చిన బామ్మగారు అన్ని జవాబులూ పుచ్చుకుని మెల్లిగా వెనుతిరిగింది-
భూ భారమంతా బండిమీద తోసుకుంటూ పోతూ అడిగి చెత్త వేయించుకునే పాకీవాడు ఆగి - “అక్కడ మీ చెత్త మీరే ఎత్థుకోవాలంట కదా” అని అడగటం -
రోడ్డు మీద దుమ్ము ఎక్కడిదక్కడే ఉన్నా, అస్త్ర సన్యాసం చేసి బీడీలు ఊదుతూ చాడీలు ఏకరువు పెట్టుకోడం,
రెండు రోజులు కొనగానే సందు మలుపులో రెండు మూరల మల్లెలతో ఆశతో నిల్చునే పూలమ్మీ,
దగ్గితే మురికి చేతులతో ఎంగిలి నీళ్ళూ ఆరాటంగా అందించే అమాయకపు అంగడి వాళ్ళూ - అంతా గమ్మత్తే !
రోజంతా పావు శేరు పల్లీలు అమ్మడానికి ఎండకి తెగించి కూచున్న అవ్వ ప్రపంచ సమస్యల గురించి ఎరుగని నిశ్చింత కబుర్లూ ,
కర్పూర గంధాక్షతల సువాసనల, పవిత్ర మంత్రాల మిశ్రమ గుడి ప్రాంగణంలో అంతర్జాతీయ స్టాక్స్ గురించి వర్తకుల ముచ్చట్లూ,
పక్కవాడి భక్తికి దేవుడు distract అయిపోతాడేమో అని గంట గోలగోలగా వాయించి తన గోడు వినమనే భక్తుల ఇక్కట్లూ,
చీదరించుకుంటున్నా పైసా పడితే మహద్భాగ్యమని తలచి, పాపాలు కడుక్కోమని రివర్స్ బ్లాక్మెయిల్ చేసే బిచ్చగాళ్ళూ - అంతా విడ్డూరమే!
ప్రతి కూడలికీ అన్ని దిశలనుంచీ ఒకే వేగంతో వొచ్చి కంటి సైగతో crisis management నిర్ణయాలు తీసుకుని దూసుకుపోయే వాహనాలూ,
oil change ఎరుగని తుప్పు పట్టిన engineలూ, చెవి తుప్పు వదలగోట్టే hornలూ, సవ్యసాచి గాండీవం అంతటి ఆటో గేరూ,
పొరబాటున కాళ్ళు ఎడంగా పెట్టి నుంచున్నా, మధ్యనుంచి దూసుకెళ్ళగల నేర్పరులు ఆటో అభిమాన్యులూ, బైక్ భస్మాసురులూ,
కొత్త కార్ అయినా, చెత్త సైకిల్ అయినా గుద్దితే అరుచుకుని, దులుపుకుని సద్దుకుని పోయే సామ్యవాదులూ - అన్నీ వింతలే!
ఊళ్ళోని తిండి బళ్ళన్నీ మన అరుగుముందే ఆగిపోతున్నాయని గునిసే అమ్మమ్మలూ, తాతయ్యలూ,
ఏ ఇద్దరు మాట్లాడుకుంటున్నా మధ్యలో జొరబడి తీర్మానాలు చెప్పేసే పక్కింటి వాళ్ళూ
మూడు బస్సులు మారి, మూడు గంటల పాటూ ప్రయాణించి వొచ్చిన బావలూ మరదళ్ళూ, చెల్లెళ్ళూ
ఆకస్మిక phone callకి విస్తుపోయి, నిష్టూరాలాడి అంతలోనే కలిసిపోయే చుట్టాలూ - అంతా అపురూపమే!
పానీపూరీ, మినపసున్ని, మున్జలూ, జామ పళ్ళూ తినే యోగం చూపిన రాశిఫలాలూ ,
ఉప్పులో ఉడికించిన వేరుశనగా , పనస తొనలూ, సీతాఫలాలూ,
బంగినిపల్లి, తోతాపురి, రసం మావిడిపళ్ళు , తర్బూజ వాసనొచ్చే తర్బూజాలూ
వెల్లుల్లి ఆవకాయ ముక్కలూ , రసగుల్లా చాట్, పప్పు చెక్కలూ - బకాసుర బాబాయి దీవెనతో - కాదేదీ snackకి అనర్హం!
షాపింగ్ ఉత్సాహం తట్టుకోలేక, సమాన స్థైర్యంతో తిరగలేక shift systemలో కాళ్ళు వేడి నీళ్ళల్లో పెట్టుకునే స్నేహితులూ ,
restaurantలో మొత్తం కుమ్మాక credit card పని చెయ్యట్లేదని తెలిస్తే ఇంటి దగ్గిర తీస్కున్తామని అప్పిచ్చిన ఆటో డ్రైవర్లూ -
అత్యాశ లేని చెప్పుల వాళ్ళూ, ఆరాటపడి చల్లబరిచే వాళ్ళూ, బేరం లేకపోయినా చీకు లేక కులాసాగా పడుకునే కొబ్బరిబొండం వాళ్ళూ ,
measurements రోజూ తీసుకోవలసి వొస్తోందని మొత్తుకున్న టైలర్లూ , వెధవ బట్టల షాప్ text messages అని విసుక్కునే నాన్నా - అంతా మురిపెమే!
మల్లెలూ, మావిడిపళ్ళూ , మమతలూ, మాటలూ అన్నీ ఆనందమే!
మనుషులూ, మొక్కలూ , మాటకారులూ , మూగాజీవులూ అన్నిటితో బంధమే!
అవే గోవులూ, ఆకులూ, పువ్వులూ, గాలులూ విమానాశ్రయానికి తిరిగి వెళ్తుంటే మాట్లాడవేం?
వొచ్చినప్పుడు సంతోషంతో కన్నీళ్ళు, వెళ్ళిపోయేటప్పుడు బాధతోనూ కన్నీళ్ళే!
ఎందుకు బాధ - బోలెడు జ్ఞాపకాలతో 'నా' ఇంటికేగా తిరిగి వెళ్తోంది! అమ్మని చూడని లోటు తప్ప - తల్లిలా చూసిన అత్తా, నాన్నల ప్రేమే రక్ష :)
శుక్రవారం సాయంత్రం వొచ్చేసి ఆదివారం సాయంత్రం తిరిగి వెళ్ళిపోయే పాద లేపనం ప్రవరాఖ్యునికి ఇచ్చిన అ ముని జాడ తెలుసుకుంటే సరి!